మండల ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Nov12 :- : జిల్లాలో మండల ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోనీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు మండల ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణ పై రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు 2026 నవంబర్ 19వ తేదీన సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికకు కనీసం ఆరు రోజుల ముందుగా నవంబర్ 14వ తేదీలోపు ఎంపీడీవోలు, ప్రిసైడింగ్ అధికారులు మండల ప్రజా పరిషత్ సభ్యులందరికీ ఫారం-2 ద్వారా ఎన్నికల నోటీసులను అందజేయాలని తెలిపారు. నోటీసులు అందజేసినట్లు సభ్యుల నుంచి రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన
నవంబర్ 19వ తేదీన ఉదయం 10 గంటలలోపు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఫారం-3 ద్వారా నామినేషన్లను స్వీకరించాలి. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండటంతో పాటు, ప్రతిపాదకులు, బలపరిచే సభ్యులు కూడా సంబంధిత మండల ప్రజా పరిషత్ ఎన్నుకోబడిన సభ్యులై ఉండాలని తెలిపారు. అభ్యర్థికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని, నిబంధనల ప్రకారం మత లేదా భాషా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన అర్హతను సంబంధిత ధృవపత్రాలతో నిర్ధారించుకోవాలని సూచించారు.ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహించి, అనంతరం నిర్ణీత నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.

కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం
అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు సమావేశం నిర్వహించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని, ప్రమాణ స్వీకార పత్రాలను రెండు ప్రతులుగా సిద్ధం చేసి ఒక ప్రతిని సభ్యునికి, మరొక ప్రతిని ప్రిసైడింగ్ అధికారి వద్ద భద్రపరచాలని సూచించారు. మినిట్స్ పుస్తకంలో కూడా సభ్యుల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో నిబంధనల ప్రకారం చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలన్నారు.

ఉపాధ్యక్షుని ఎన్నిక:
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అదే రోజు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి తదుపరి సమావేశం నిర్వహించాలి. సమావేశ సమయాన్ని కార్యాలయ నోటీసు బోర్డుపై ముందుగా ప్రకటించాలని అధికారులకు సూచించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్ణీత సమయపాలన పాటిస్తూ, అన్ని రికార్డులు మరియు ఎన్నికల సంబంధిత పత్రాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సిఈఓ శివశంకర్, జెడ్పి సీఈవో సుబ్బారెడ్డి, డి ఎల్ డి వో శివారెడ్డి పాల్గొన్నారు.
Arattai