పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకూడదు : జిల్లా కలెక్టర్
NANDAYAL Nov27:- జిల్లాలో రెండో, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి జవాబుదారీతనంతో నిర్వర్తించాలని, పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండో, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తదుపరి విడతల్లో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫేజ్-2 ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి
రెండో విడతలో భాగంగా జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 195 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 72 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 123 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన నిఘా
పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇంక్ తదితర అనధికార వస్తువులను అనుమతించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు సంబంధం లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశిస్తే వెంటనే బయటకు పంపించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించే ప్రయత్నాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ అవసరమైన మేరకు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, తరలింపు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, ఓటరు స్లిప్పులను అధీకృత సిబ్బంది ద్వారానే పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పోలింగ్ శాతంపై నిరంతర పర్యవేక్షణ
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 9 నుంచి 11 గంటల వరకు, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయ్యే పోలింగ్ శాతాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని, పోలింగ్ శాతం, ఇతర ఎన్నికల వివరాలను నిర్ణీత సమయంలో ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయాలని సూచించారు
కౌంటింగ్‌లో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, సాధ్యమైనంత వరకు సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, రీకౌంటింగ్ అభ్యర్థనలను నిబంధనల ప్రకారమే పరిశీలించాలని సూచించారు. ఫలితాల ప్రకటన సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు లోనుకాకుండా రిటర్నింగ్ అధికారులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు (RO), ప్రిసైడింగ్ అధికారులు (PO) తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించా లన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో ఎంపీడీవోలు తమ పరిధిలోని ఏర్పాట్లకు పూర్తి బాధ్యత వహించాలని, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్డీఓలు సమన్వయంతో అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా రెండో, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ శాఖ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Arattai