రాజకీయ ప్రకటనలపై ప్రత్యేక నిఘా – పెయిడ్ న్యూస్‌పై కఠిన పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct 16:- నంద్యాల జిల్లాలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న రెండో సాధారణ ఎన్నికలు-2026 నేపథ్యంలో రాజకీయ ప్రకటనలపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టేందుకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ ప్రకటనలు, వార్తా కథనాల రూపంలో ప్రచురితమయ్యే ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌లను గుర్తించి పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత అని వివరించారు. జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి జాయింట్ కలెక్టర్ జి. సూరజ్ ధనుంజయ గనోరే ఛైర్మన్‌గా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శివశంకర్ సభ్యుడిగా, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి జె. మల్లికార్జునయ్య సభ్యుడిగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు
వివిధ మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలపై నిఘా
జిల్లాలోని వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియో, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లోని ఆడియో-విజువల్ డిస్ప్లేలు, ఈ-పేపర్లు, బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ సందేశాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే రాజకీయ ప్రకటనలను కమిటీ నిరంతరం పరిశీలిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వార్తా కథనాల ముసుగులో ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనలను గుర్తించి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు.
పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రచురితమయ్యే చెల్లింపు వార్తలను గుర్తించడంతో పాటు, అభ్యర్థుల తరఫున ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరిగే రాజకీయ ప్రకటనలను కమిటీ పర్యవేక్షిస్తుందని కలెక్టర్ వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి, అభ్యర్థులకు నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు వాస్తవంగా చేసిన ఎన్నికల ప్రచార వ్యయాలకు సంబంధించిన వివరాలను సమర్పించని సందర్భాల్లో, నిర్ధారించిన ప్రామాణిక రేట్ల ఆధారంగా ప్రకటనల వ్యయాన్ని అంచనా వేసి, నిబంధనల ప్రకారం సంబంధిత అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాలో నమోదు చేసేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని మీడియా సంస్థలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని, రాజకీయ ప్రకటనలు మరియు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Arattai