మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Oct16:- మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి నామినేషన్ల సమర్థవంత ప్రక్రియపై కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ఎన్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో పోలీసుల నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు.

నామినేషన్ పత్రాల పరిశీలనలో నిబంధనలు పాటించాలి
నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల సమర్పణకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు నిర్ణీత గడువులోగా సమర్పించేలా అవగాహన కల్పించాలని, పత్రాల స్వీకరణ, పరిశీలనలో ఎలాంటి అనవసర జాప్యానికి తావివ్వకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి, నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక డెస్క్లు
నామినేషన్ల దాఖలుకు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్ల జారీలో అభ్యర్థులకు సౌలభ్యం కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్లను మున్సిపల్ కార్యాలయాల్లో కాకుండా సంబంధిత తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేసి జారీ చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్లు ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా సమన్వయం చేసుకోవాలని, సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.
Arattai