నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ!
సగం.. సగం ఓట్లు.. చివరకు టాస్ తప్పదా?
NANDYAL Nov11:- నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీల బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు తమదైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ప్రస్తుతం కౌన్సిలర్ల సంఖ్య ప్రకారం వైఎస్సార్సీపీకి 27 మంది, టీడీపీకి 25 మంది సభ్యుల బలం ఉన్నట్లు రాజకీయ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అయితే టీడీపీకి ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ ఓట్లు కలిస్తే ఆ పార్టీ బలం 28కి చేరి వైఎస్సార్సీపీతో సమానంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంటే టీడీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెరుగుపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్సీ ఇసాక్ భాషకు ఓటు హక్కు కల్పిస్తే సమీకరణాలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్సీకి కూడా ఓటు అవకాశం కల్పించాలంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి ఓటు వేసే అవకాశం కల్పించకపోతే ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ ఓట్లతో టీడీపీకి ఒక ఓటు ఆధిక్యం లభించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరి లెక్కలు వారివిగా రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇరు పార్టీల మధ్య మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లు సమాచారం. తొలుత రెండేళ్ల పాటు టీడీపీకి వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఇచ్చి, ఆ తర్వాత మూడేళ్లు వైఎస్సార్సీపీకి అవకాశం కల్పించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు శిల్ప మోహన్ రెడ్డి, రవి రెడ్డిలు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అన్ని రాజకీయ సమీకరణాలు బెడిసికొడితే చివరకు టాస్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు రెండు పార్టీల్లోని రెడ్డి, బలిజ, ఆర్యవైశ్య తదితర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల ఆశీస్సులు పొందేందుకు తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద నంద్యాల మున్సిపల్ ఎన్నికల చివరి అంకమైన వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉత్కంఠభరితంగా మారింది. చివరకు రాజకీయ చర్చలు ఫలిస్తాయా? ఓట్ల లెక్కలు పైచేయి సాధిస్తాయా? లేక టాస్‌తో విజేతను నిర్ణయించాల్సి వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
Arattai