గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి : వీఆర్ఏలు
NANDYAL Sep25 :- గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నంద్యాలలో వీఆర్ఏలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు కొనసాగుతున్న సహాయ నిరాకరణ సమ్మెలో భాగంగా శుక్రవారం (25వ తేదీ) దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, నామినీ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు.

గత రెండున్నర సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వీఆర్ఏలు తెలిపారు. తమ సమస్యలు ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసేలా ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.కాగా, వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు డబ్ల్యూఆర్ఎస్, వీఆర్వోల సంఘం సంఘీభావం ప్రకటించగా, ఆఫీస్ అటెండెంట్లు కూడా మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మండల అధ్యక్షులు అత్తర్ బాషా, నగేష్, జయసూర్య, సాయి, గౌరవ అధ్యక్షులు ఎర్ర బూరిగలు విజయ్, శివలింగం, మద్దిలేటి, శేఖర్, నరసింహ, భీమవరం కృష్ణతో పాటు ఆయా గ్రామాలకు చెందిన వీఆర్ఏలు పాల్గొన్నారు.
Arattai