నంద్యాలలో ఘనంగా అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు
NANDYAL Sep26 :- శనివారం స్థానిక ఆయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల ప్రత్యేక పాఠశాల లో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నవజీవన్ బధిరుల పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జాన్ మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, లయన్స్ అంతర్జాతీయ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

బధిర బాలలు తమ వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో జీవితంలో విజయాలు సాధించాలని కోరారు.చదువుతోపాటు క్రీడల్లో,సాంస్కృతిక కళలలో పాల్గొని విజయాలు సాధించాలని, బధిరుల కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక క్రీడా పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు దివ్యాంగులకు జీవితంలో పైకి ఎదగడానికి ప్రస్తుతం అన్ని రకాల తోడ్పాటు అందిస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం 6000 రూపాయల నెలవారీ పెన్షన్ అందించడమే కాకుండా, ప్రత్యేక విద్యాసంస్థలు నెలకొల్పుతున్నారని, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ప్రోత్సహిస్తున్నారని , స్వచ్ఛంద సంస్థలు వారు విజయం సాధించడంలో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారని, బధిర విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి సంవత్సరం క్రీడా పరికరాలు అందించడమే కాకుండా అవసరమైన ఇతర సహాయ సహకారాలను నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, లయన్స్ క్లబ్, ఐఎంఏ తరఫున అందిస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా బధిర బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాట, సంగీతం వినిపించక పోయినప్పటికీ, సంగీతానికి అనుగుణంగా, డాన్స్ టీచర్ సంజ్ఞలతొ ఇచ్చే సూచనలతో చక్కటి నృత్య ప్రదర్శనలు చేయడం విశేషం.ఈ కార్యక్రమంలో నవజీవన్ పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జాన్ మేరీ, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, ఇతర అధ్యాపక బృందం పాఠశాలలో చదువుకుంటున్న బధిర బాలలు పాల్గొన్నారు.
Arattai