రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా,ఎస్పీ సునీల్ షొరాణ్
NANDYAL Sep24 :- మహిళలు, చిన్నారుల భద్రత, రహదారి భద్రత, మత్తుపదార్థాల నిర్మూలన అనే మూడు కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టి, క్షేత్రస్థాయిలో వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి “త్రిశూల్” కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర మత్తుపదార్థాల నిర్మూలనకు సంబంధించి జిల్లాలో అమలవుతున్న చర్యలు, సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, ఐసీడీఎస్ పీడీ లీలావతి దేవి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి నెలా “త్రిశూల్”పై ఉమ్మడి సమీక్షలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహిళా భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నెలా ప్రత్యేక ఉమ్మడి సమీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ మూడు అంశాలను సమగ్రంగా పర్యవేక్షించేందుకు నిర్వహించే ఉమ్మడి సమీక్షలకు “త్రిశూల్”గా నామకరణం చేసినట్లు తెలిపారు. జిల్లాల నుంచి అందే నివేదికల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారని వివరించారు.
బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు క్షేత్రస్థాయి యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, బ్లాక్స్పాట్ల వద్ద లైటింగ్, సూచిక బోర్డులు, రహదారి ఇంజినీరింగ్ తదితర చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. వాహనదారుల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంచడంతో పాటు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు, విద్య, సంక్షేమ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారంపై తక్షణమే స్పందించేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచేందుకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

బ్లాక్స్పాట్లపై ప్రత్యేక దృష్టి – ఎస్పీ సునీల్ షొరాణ్
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, మహిళలు – చిన్నారుల రక్షణ, మత్తుపదార్థాల నియంత్రణను అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన ప్రతి బ్లాక్‌స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అవసరమైన చోట రహదారి ఇంజినీరింగ్ మార్పులు, హెచ్చరిక సూచిక బోర్డులు, లైటింగ్, కెమెరాలు తదితర భద్రతా చర్యలను సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సుమారు 3 శాతం తగ్గినట్లు ఎస్పీ తెలిపారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ ప్రమాదాలను మరింత తగ్గించేందుకు శాఖల వారీగా నిర్దేశించిన చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

శాంతిరాం ఆసుపత్రి పరిసరాల్లోనూ తగినంత లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. తగిన లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉండకూడదని ఎన్‌హెచ్ అధికారులకు స్పష్టం చేశారు. రవాణా శాఖ నిర్వహించే వాహన తనిఖీల్లో పోలీసు శాఖతో సమన్వయం పెంచుకోవాలని, ప్రమాదాలకు కారణమయ్యే వాహనాలు, డ్రైవింగ్ ఉల్లంఘనలపై నిఘా పెంచాలని సూచించారు. రోడ్లపై సంచరించే మూగజీవాల కారణంగా ప్రమాదాలు జరగకుండా వాటికి రేడియం కాలర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

గ్రామాలు, తండాల్లో మహిళా భద్రతపై విస్తృత అవగాహన
మహిళల భద్రతకు సంబంధించి పోలీసులు గ్రామాలు, తండాలను సందర్శించి మహిళలు, బాలికలకు అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలు, చట్టపరమైన హక్కులు, ఫిర్యాదు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా, సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలతో పోలీసుల పరస్పర వ్యవహారశైలి ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపుతుందని, మహిళా భద్రతపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మత్తుపదార్థాలపై నిరంతర నిఘా
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తుపదార్థాలకు ఆకర్షితులు కాకుండా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మత్తుపదార్థాల వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకునేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. మత్తుపదార్థాల గుర్తింపు, నియంత్రణకు సంబంధించి ప్రతి పోలీసు స్టేషన్‌కు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచినట్లు, వాటిని వినియోగిస్తూ ప్రతి ఆదివారం తగిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మత్తుపదార్థాల సేకరణ, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మత్తుపదార్థాల నియంత్రణ, మహిళా భద్రతకు సంబంధించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచి ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
Arattai