నంద్యాలలో నూతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభం
NANDYAL Sep25 :- నూతనంగా ఏర్పాటైన నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ (ZPP) పరిపాలనా కార్యకలాపాలను సజావుగా, సమర్థవంతంగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి జి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని మండల్ రిసోర్స్ సెంటర్ (MRC) భవనంలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. నూతన జిల్లాకు, నూతన జిల్లా ప్రజా పరిషత్‌కు తాత్కాలిక భవనంలో పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ తొలి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతమైన పరిపాలన
పరిషత్ వ్యవస్థ ప్రజలు, ప్రజాప్రతినిధులతో నేరుగా అనుసంధానమై పనిచేసే కీలకమైన స్థానిక పాలనా వ్యవస్థ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థలు గ్రామాల సమస్యలు, అభివృద్ధి అవసరాలను ప్రజలతో చర్చించి, గ్రామసభలు, వార్డు సభల ఆమోదంతో కార్యక్రమాలను చేపడుతున్న విధంగానే జిల్లా ప్రజా పరిషత్ పరిపాలన కూడా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు

జిల్లాలో సమృద్ధిగా వనరులు.. అభివృద్ధికి విస్తృత అవకాశాలు
నంద్యాల జిల్లాలో సమృద్ధిగా సహజ, మానవ వనరులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్‌కు కూడా సముచితమైన ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉందని, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జిల్లా ప్రజా పరిషత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

నూతన జిల్లా ప్రజా పరిషత్‌కు CEO, డిప్యూటీ CEOలను త్వరలో నియమించే ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అప్పటివరకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న CEO, డిప్యూటీ CEOలు బాధ్యతలను కొనసాగిస్తారని చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ నుంచి 45 మంది ఉద్యోగులను నూతన నంద్యాల జిల్లా ప్రజా పరిషత్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఇకపై వారు నంద్యాల జిల్లా పరిధిలోనే విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Arattai