నంద్యాలలో ఘనంగా టిడ్కో గృహ ప్రవేశ మహోత్సవం
NANDYAL Sep27 :- నంద్యాల పట్టణంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎస్.ఆర్.బి.సి. కాలనీ వద్ద ఆదివారం ఏపీ టిడ్కో–పీఎంఏవై (అర్బన్) ఎన్టీఆర్ నగర్ గృహ ప్రవేశ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ 560 మంది లబ్ధిదారులకు నూతన గృహాల తాళాలను అందజేశారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సొంత ఇల్లు లేని అర్హులైన నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా స్వర్ణ వార్డుల ద్వారా సర్వే నిర్వహించి, సోషల్ ఆడిట్ అనంతరం పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పేదలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రూ.6.55 లక్షల విలువైన 300 చదరపు అడుగుల టిడ్కో గృహాన్ని కేవలం రూ.1కే లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 365, 430 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం రాయితీ కల్పించినట్లు వివరించారు. లబ్ధిదారులకు ఉచితంగా స్థలం కేటాయించడంతో పాటు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోందన్నారు. వివిధ కారణాల వల్ల గతంలో గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులు చెల్లించిన వాటా మొత్తాన్ని నిబంధనల మేరకు వారి బ్యాంకు ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఎస్.ఆర్.బి.సి. లేఅవుట్లో 560 మంది లబ్ధిదారులకు గృహాల తాళాలు అందజేశామని, మిగిలిన గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి డిసెంబర్ 2026 నాటికి అన్ని గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టిడ్కో గృహ సముదాయాలను కేవలం నివాస ప్రాంతాలుగా కాకుండా ఆధునిక మౌలిక వసతులతో కూడిన మినీ టౌన్షిప్ తరహా గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సుమారు రూ.56.91 కోట్ల వ్యయంతో అంతర్గత రహదారులు, తాగునీటి వసతి, డ్రైనేజీ, విద్యుత్, ఎస్టీపీతో పాటు పాఠశాల, ఆసుపత్రి, పార్కులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ పక్కా గృహాలు లబ్ధిదారుల కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనాన్ని అందించడంతో పాటు, వారి భావితరాలకు ఆస్తిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం మంత్రి ఫరూక్, ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ లబ్ధిదారులకు టిడ్కో గృహాల తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, మెప్మా పీడీ వెంకటదాస్, టిడ్కో అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం కావడంపై లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Arattai