నంద్యాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జాషువ జయంతి
NANDYAL Sep28 :- సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువ జయంతి కార్యక్రమాన్ని నంద్యాలలోని సాహితీ స్రవంతి కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సాహితీవేత్తలు గుర్రం జాషువ చిత్రపటానికి పుష్పమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, సామాజిక చైతన్యాన్ని తన కవిత్వం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన మహాకవి గుర్రం జాషువ అని అన్నారు. ఆయన సాహిత్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమన్నారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి డా. నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుర్రం జాషువ తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహకు ప్రతీక అని అన్నారు. కుల, మత, ఆర్థిక అసమానతలపై తన కలం ద్వారా పోరాడిన జాషువ, ముఖ్యంగా గబ్బిలం వంటి రచనల ద్వారా అణగారిన వర్గాల వేదనను, మానవ సమానత్వ ఆవశ్యకతను బలంగా చాటారని పేర్కొన్నారు. జాషువ సాహిత్యాన్ని నేటి యువతకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాషువ కేవలం ఒక కవి మాత్రమే కాదని, సమాజాన్ని మేల్కొలిపిన మహా చైతన్యవాది అని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. కవులు నరేంద్ర, అవ్వారి శేషఫణి, నీలకంఠమాచారి వినిపించిన కవితలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, సాంబశివారెడ్డి, సాహితీ స్రవంతి సభ్యులు రామచంద్రమూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Arattai