బాల అకాడమీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
NANDYAL Nov13 :- విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, సృజనాత్మక, క్రీడా పోటీలతో పాటు ప్రతిభావంతులకు బహుమతులు, ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

వేడుకల్లో భాగంగా నవనంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్లో సైక్లింగ్ పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ఎనిమిదో తరగతి విద్యార్థి జునైద్ ప్రథమ స్థానంలో నిలిచి సైకిల్‌ను బహుమతిగా గెలుచుకోగా, ఏడో తరగతి విద్యార్థిని సఫియా ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షుడు విక్రమ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 30 శాతం రాయితీతో కూడిన 150 కూపన్లను పంపిణీ చేశారు.

అదేవిధంగా బాల అకాడమీలో విద్యనభ్యసించి పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగి, పలు బంగారు పతకాలు సాధిస్తున్న పూర్వ విద్యార్థిని కుమారి పల్లవిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆమె విజయాలు ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

విద్యారంగంలో విశేష సేవలందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న బాల అకాడమీ కరస్పాండెంట్ మాధవి లతకు ప్రగతి రత్న, కీర్తి రత్న అవార్డులు లభించడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆమెను ఘనంగా సత్కరించి అభినందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవి కిండర్ గార్టెన్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.

మరోవైపు ఎస్బీఐ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, విజయాలు సాధించిన వారిని గౌరవించడం ద్వారా బాలల దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.
Arattai