గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Nov11 :- గ్రామ పంచాయతీ-2026 రెండో సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో లు, ఎం ఓ టీ లు, టి ఓ టి అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో లు, ఎం ఓ టీ లు, టి ఓ టి ల కు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పత్రాల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా తయారీ, బ్యాలెట్ పేపర్ రూపకల్పన, అభ్యర్థులకు ఎన్నికల గుర్తింపు కేటాయింపు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 408 గ్రామ పంచాయతీలను 175 క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్‌కు ఒకరి చొప్పున 175 మంది స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొదటి విడత 9 మండలాలు రెండవ విడత 11 మండలాలు మూడవ విడత 8 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే మరింత విస్తృతమైన ప్రక్రియ అని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై అధికారులు పిక్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా, చట్టాన్ని అమలు చేసే బాధ్యత కలిగిన పౌరులుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్టపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, అవసరమైన పత్రాలు, జిరాక్స్ కాపీలు, కుల ధ్రువీకరణ పత్రాలు, అభ్యర్థుల అర్హతలు, ఇతర ఎన్నికల నిబంధనలపై రిటర్నింగ్ అధికారులు పూర్తి స్పష్టత కలిగి ఉండాలని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎన్నికల నియమ నిబంధనలపై సరైన సమాచారం అందించాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.*నామినేషన్ పత్రాలు, అఫీడివిట్లు, వయ్యానికి సంబంధించిన డిక్లరేషన్లు పరిశీలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పరిశీలన ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనేది ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైన దశ అని, ఈ దశలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
Arattai