నంద్యాలలో ఘనంగా నంద్యాల గాంధీ కాదరాబాద్ నర్సింగరావు జయంతి ఉత్సవాలు
NANDYAL Nov14 :- స్వాతంత్ర సమరయోధుడు, నంద్యాల గాంధీగా ప్రసిద్ధి చెందిన కాదరాబాద్ నర్సింగరావు 138వ జయంతి ఉత్సవాలు నంది రైతు సమాఖ్య కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య, మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు నర్సింగరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ కాదరాబాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నర్సింగరావు అందరూ చదువుకోవాలని కోరుకున్నారని, అందుకోసం కె.ఎన్.ఎం మున్సిపల్ పాఠశాలకు నంద్యాలలో సుమారు నాలుగు ఎకరాల భూమిని దానం చేశారని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం కుందూ నదిపై వంతెన నిర్మించారని, ఊరూరా హరిజన హాస్టళ్లను ఏర్పాటు చేశారని చెప్పారు. సమాజమే దేవాలయం, సంఘమే నా ఇల్లు అని, ఆకలితో ఎవరూ అలమటించకూడదనే ఆశయంతో ఆయన జీవించారని కొనియాడారు.

చరిత్ర పరిశోధకులు డాక్టర్ కిషోర్ కుమార్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వారి శేషపణి మాట్లాడుతూ నర్సింగరావు కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సేవ చేశారని, దేవాలయాలకు, మసీదులకు, పాఠశాలలకు సొంత భూములు దానం చేసిన అపర దానకర్ణుడని అభివర్ణించారు. మాతృభాష పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అన్నెం శ్రీనివాస్ రెడ్డి, డా.నీలం వెంకటేశ్వర్లు, కవి, రచయిత ఎం.డి. రఫీ మాట్లాడుతూ నర్సింగరావు క్రమశిక్షణ, దానగుణం, విద్యా సేవలను కొనియాడారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, రాజేంద్రప్రసాద్ లను ఆదర్శంగా తీసుకుని ఆయన దేశసేవ చేశారని పేర్కొన్నారు. నంద్యాల గాంధీ చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా సంఘసేవకులు బాలచంద్రుడిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవి నీలకంఠమాచారి,కైలాసనాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు, రైతులు, అభిమానులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Arattai