చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య అందేలా చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct 01:- అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరిరక్షణ సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. గురువారం నంద్యాల మండలం పోలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1ను జిల్లా కలెక్టర్ సందర్శించి, కేంద్రంలో అందుతున్న సేవలను పరిశీలించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువు, ఆటలు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల అభ్యసన సామర్థ్యం, చురుకుదనాన్ని పరిశీలిస్తూ వారితో సరదాగా మాట్లాడారు.

అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న ప్రీ-స్కూల్ విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సేవలపై సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు, బరువు, ఎత్తు, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి అవసరమైన పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం నిర్ణీత ప్రమాణాల మేరకు సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు బాల్యదశ నుంచే విద్య, పోషణ, ఆరోగ్యం, సృజనాత్మక అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, పరిసరాల పారిశుధ్యం, మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, సురక్షితంగా, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు
Arattai