పోలూరు గ్రామంలో పింఛన్ పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి
NANDYAL Oct 01:- సామాజిక భద్రత, ఆర్థిక చేయూత లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో గురువారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, పింఛన్ అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియడం సంతోషంగా ఉందన్నారు. పింఛన్ పంపిణీ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా నిర్ణీత సమయంలో పింఛన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ అందేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.

జిల్లాలో 2.09 లక్షల మందికి సుమారు రూ.92 కోట్ల పింఛన్లు – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల జిల్లాలో ప్రతి నెలా 16 రకాల పింఛన్లను సుమారు 2.09 లక్షల మంది లబ్ధిదారులకు రూ.92 కోట్ల మేర పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి తెలిపారు. వివిధ కేటగిరీలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పింఛన్లు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పూర్తిస్థాయి వైకల్యం, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తదితర ప్రత్యేక కేటగిరీలకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పెంచిన మొత్తాలు అందుతున్నాయని వివరించారు.

ఒంటరి మహిళా పింఛన్‌కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. అర్హత కలిగిన వారికి నిబంధనల మేరకు పింఛన్ మంజూరయ్యేలా అధికారులు దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

లబ్ధిదారులకు పింఛన్ పంపిణీతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Arattai