నంద్యాల హనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో ఘనంగా ఫ్రూట్స్ ఫెస్టివల్
NANDYAL Oct 09 :- స్థానిక హనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో విద్యార్థులచే ఫ్రూట్స్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. నేటి పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతూ వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయల ప్రాముఖ్యతను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో, వివిధ రకాల పండ్లు, కూరగాయల విశిష్టతను తెలియజేస్తూ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పండ్లు, కూరగాయలు, గుడ్లు వంటి పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని, ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనవసరమైన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ, “ఆహారమే ఔషధం కావాలి” అని అన్నారు. ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు, గుడ్లు వంటి పోషకాహార పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జంక్ ఫుడ్, అధిక నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఫ్రూట్స్ ఫెస్టివల్‌పై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెరుగుతుందని, భవిష్యత్తులో కూడా మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
Arattai