నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జయప్రదం చేయండి : APUWJ పిలుపు
NANDYAL Nov14 :- నవంబర్ 16న ‘జాతీయ పత్రికా దినోత్సవాన్ని జయప్రదం చేయండని ఏపీయూడబ్ల్యుజే నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో యూనియన్ బ్యాంక్ పక్కన మినీ ఆడిటోరియం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రక్కన సోమవారం ఉదయం 10:30 గంటలకు పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత అనే అంశంపై విస్తృత స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఏపీయుడబ్ల్యూజె జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఏపీయుడబ్ల్యూజే పట్టణ అధ్యక్షులు రాజకుమార్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంటు చట్టం ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని, 1966 నవంబరు 16న అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఈ చారిత్రాత్మకమైన ఆ తేదీని “జాతీయ పత్రికా దినోత్సవం”గా ప్రతియేటా నిర్వహిస్తుంటామని, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, వర్కింగ్ జర్నలిస్టుల వేతన సవరణ, మెరుగైన పని పరిస్థితులు, మీడియా సిబ్బంది రక్షణ తదితర వాటిపై సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. పీసీఐ తనకు నిర్దేశించిన చట్టబద్ధమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమం గట్టిగా డిమాండ్ చేయాల్సిన తరుణమని, కావున నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీయుడబ్ల్యూజే సభ్యులు ఈ సదస్సులో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.
Arattai