ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర రాజకీయ నాయకులు, ప్రచారకులు పట్టణాలను విడిచి వెళ్లాలి : జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాజకుమారి
NANDYAL Oct30 :- నంద్యాల జిల్లాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల ప్రచార గడువు నేడు (అక్టోబర్ 30) సాయంత్రం 5 గంటలకు ముగిసిన నేపథ్యంలో స్థానికేతర రాజకీయ నాయకులు, ప్రచారకులు పట్టణాలను విడిచి వెళ్లాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం, 1965లోని సెక్షన్ 343-సి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రచార గడువు ముగిసిన వెంటనే సంబంధిత మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఓటర్లు కాని బయటి రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రచారకులు, మద్దతుదారులు తప్పనిసరిగా ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. బయటి ప్రచారకుల ఉనికిని గుర్తించేందుకు హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, కళ్యాణ మండపాలు, ఇతర వసతి కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర ప్రచారకులు, మద్దతుదారులు సంబంధిత పట్టణ స్థానిక సంస్థల పరిధిని విడిచి వెళ్లేలా చూడాలని కలెక్టర్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎన్నికల చట్టాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Arattai