ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా APUS కృషి
NANDYAL Oct16 :-ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర సహకోశాధికారి కృష్ణార్జున రెడ్డి, నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.ఎన్. విజయభాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 28 మండలాల్లో సంఘ కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆవశ్యకత, ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారంలో సంఘం పోషించాల్సిన పాత్రపై వక్తలు వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ, సామాజిక పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఉద్యోగుల విభజన, సర్వీస్ రిజిస్టర్ల ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, సంఘ సభ్యులంతా సమన్వయంతో పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల విధుల నుంచి అర్హులకు మినహాయింపు ఇవ్వాలి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులు, శిశువులకు పాలిచ్చే మహిళా ఉపాధ్యాయులు, గర్భిణీ మహిళా ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో కోరారు. ఆయా ఉపాధ్యాయుల ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Arattai