అక్టోబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు : జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్
NANDYAL Oct 16:- జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తూ, అక్టోబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పురోగతి, పెండింగ్ దరఖాస్తులు, నోటీసుల పరిష్కారం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఫారాలు, నోటీసులకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ సకాలంలో పరిష్కరించినట్లు వెల్లడించారు. ఓటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, జాతీయ ఫిర్యాదుల సేవా పోర్టల్ (నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్) ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా, “బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ” సదుపాయం ద్వారా ఓటర్లు తమ సమస్యలను సంబంధిత బూత్ స్థాయి అధికారితో (బీఎల్ఓ) ఫోన్లో మాట్లాడి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు.
ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డీఆర్ఓ తెలిపారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకతకు, కచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రియాజ్ బాషా, టీడీపీ ప్రతినిధి పటాన్ హుసేన్, వైఎస్సార్సీపీ ప్రతినిధి సాయిరామ్ రెడ్డి, బీఎస్పీ ప్రతినిధి శ్రీనివాసులు, సీపీఐ ప్రతినిధి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Arattai