పెండేకంటి సేవలు చిరస్మరణీయం – నంద్యాలలో ఘనంగా 34వ వర్ధంతి
NANDYAL Oct 12 :- నంద్యాల పట్టణంలో సోమవారం నంది రైతు సమాఖ్య మరియు మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారి 34వ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలోముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు కాదర్ బాద్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాన వక్తగా డాక్టర్ గెలివి సహదేవుడు, ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డి, వాసవి క్లబ్ మాజీ గవర్నర్ జొన్నలగడ్డ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాదర్ బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారు నంద్యాల పార్లమెంటు స్థానం నుండి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే మార్గం ఏర్పాటులో పెండేకంటి కృషి మరవలేనిదన్నారు. బీహార్ గవర్నర్ గా ఉన్న సమయంలో నంద్యాలకు వచ్చి భారత పత్తి మిల్లు సమాఖ్య వారి పత్తి పరిశోధన స్థానం సందర్శించి శాస్త్రవేత్తలను అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాశీపురం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఎస్సార్ బీసీ కాలువ ఏర్పాటులో పెండేకంటి గారు చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

ప్రధాన వక్త డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాయలసీమ కరువు నివారణకు ప్రణాళికలు రచించిన మేధావి, విద్యావేత్త అని అన్నారు. నంద్యాల ప్రాంతంలో ఎన్నో విద్యా సంస్థలకు పునాది వేసి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు చూపారని తెలిపారు. మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పెండేకంటి గారు ప్రజా జీవితంలో నిజాయితీకి, నిబద్ధతకు ప్రతీక అని, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా ఉన్నత పదవులు చేపట్టినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనదని, నేటి యువతరం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
రచయిత డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ పెండేకంటి గారు సంజామల సర్పంచ్ స్థాయి నుండి కేంద్ర హోం శాఖ మంత్రిగా, బీహార్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా ఎదిగే వరకు ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదోని, నంద్యాల పార్లమెంటు స్థానాల నుండి వరుసగా ఐదు సార్లు గెలిచి సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరియన్ గా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడు పెండేకంటి అని కొనియాడారు.
అనంతరం ఇటీవల స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కాశీపురం ప్రభాకర్ రెడ్డిని, వాసవి క్లబ్ ద్వారా విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ మాజీ గవర్నర్ జొన్నలగడ్డ నాగరాజును, నూతన పుస్తకాల ప్రచురణకు డిటిపి రంగంలో కృషి చేస్తున్న ఓబులేసును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య, న్యూక్లియస్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి కవులు, రచయితలు డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ, అవ్వారి శేషఫణి, నీలకంఠమాచారి నంది రైతు సమాఖ్య ప్రతినిధులు ఓబుళపతి, కైలాసనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Arattai