అనాథగా మారిన విద్యార్థిని ఉన్నత విద్యకు కలెక్టర్ భరోసా
NANDYAL Oct 12 :- గత సంవత్సరం చాగలమర్రి మండలం చిన్నగొంగలి గ్రామంలో వర్షాల కారణంగా మట్టిమిద్దె కూలిన ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇంటర్మీడియట్ విద్యార్థిని గురులక్ష్మి ప్రసన్నకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా అండగా నిలిచారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో విద్యార్థినితో మాట్లాడి, ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబాన్ని కోల్పోయినప్పటికీ ధైర్యంగా చదువును కొనసాగిస్తూ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించడంతో పాటు, విద్యార్థిని భవిష్యత్తు కోసం రూ.2 లక్షలను ఆమె అమ్మమ్మకు అందించిందని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పేదరికం లేదా ప్రతికూల పరిస్థితులు విద్యకు అడ్డంకులు కాకూడని, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని విద్యార్థినికి సూచించారు. ఆమె విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారం అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Arattai