అంతరిక్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేసి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు బాటలు వేయాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
NANDYAL Oct07 :- అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించుకొని, ప్రయోగాత్మక అభ్యసనం, పరిశోధనా దృక్పథంతో విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఎస్.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘రాకెట్ రివల్యూషన్’ థీమ్‌తో అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఇస్రో ఎంపిక చేసిన ఆరు కార్యక్రమ వేదికల్లో నంద్యాల కూడా చోటు దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలు నిశ్శబ్దంగా, నిరంతర కృషితో దేశ అంతరిక్ష రంగంలో విశేష పురోగతిని సాధిస్తూ దేశాభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. విద్యార్థులు చదువును తరగతి గదులకే పరిమితం చేయకుండా ప్రయోగాలు, ప్రాక్టికల్స్, పరిశీలన, అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు.

నేటి విద్యార్థులే రేపటి అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదిగి కమ్యూనికేషన్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, అధునాతన రాకెట్ సాంకేతికతలను అభివృద్ధి చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత, నిరంతర శ్రమను అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

అంతరిక్ష సాంకేతికత సామాన్య ప్రజల జీవన విధానంలోనూ కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ వివరించారు. వాతావరణ పరిస్థితుల అంచనా, తుఫానులు, వరదలపై ముందస్తు హెచ్చరికలు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు వ్యవసాయ రంగంలో నేల తేమ, పంటల పరిస్థితి, సాగుకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో అంతరిక్ష సాంకేతికత ఎంతో ఉపయోగపడుతోందన్నారు.

భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో నిరంతరం శ్రమించాలని కలెక్టర్ ఉద్బోధించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వివిధ పాఠశాలల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మెమొంటోలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో షార్ (SHAR) ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.శంకరన్, ఇస్రో సీనియర్ సైంటిస్ట్ టి. శ్రీనివాసరెడ్డి, సైంటిస్ట్ ఆదిత్య తదితర ఇస్రో శాస్త్రవేత్తలు, ఎస్.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Arattai