స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా,పకడ్బందీగా నిర్వహించాలి
NANDYAL Oct18 :- స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత, ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్ల పురోగతిపై ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జె. వెంకట మురళి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పి. శ్యామల సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి. సూరజ్ ధనుంజయ్, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, సబ్ కలెక్టర్ మనీషా, సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల అధికారులు, నిఘా బృందాల నియామకం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జె. వెంకట మురళి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, భావోద్వేగాలు, ఆధిపత్య పోటీ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇతర జిల్లాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అల్లర్లు, దాడులు, దోపిడీలు వంటి ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, లైసెన్స్ లేని ఆయుధాలు, అక్రమ ఆయుధాల వినియోగం, పెట్రోల్, కిరోసిన్ వంటి పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలు నిలిపివేసే నిబంధనను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. మద్యం ప్రభావంతో నేరాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ, తగిన అవగాహన కల్పించాలని, శిక్షణ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో ప్రతి దశను అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ, ఎన్నికల సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, సంబంధిత డేటా భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల కదలికలు, అనుమానాస్పద కార్యకలాపాలపై వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నగదు పంపిణీ, మద్యం అక్రమ రవాణా, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను ముందుగానే గుర్తించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పి. శ్యామల మాట్లాడుతూ, ఎన్నికల వ్యయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితులను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రోజువారీ నివేదికలను సక్రమంగా పరిశీలిస్తూ, వ్యయ వివరాలను నిరంతరం నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు గుర్తించినప్పుడు సంబంధిత బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, అవసరమైన నివేదికలను ఆదాయపు పన్ను శాఖకు పంపించాలని పేర్కొన్నారు. నగదు, మద్యం పంపిణీ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలు సమన్వయంతో స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుల కోసం వేచి చూడకుండా, క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షణ చేపట్టి అక్రమాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా మాట్లాడుతూ, జిల్లాలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో వార్డులను క్లస్టర్లుగా విభజించి ఎన్నికల అధికారులను నియమించామని, మున్సిపల్ చైర్పర్సన్ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన గదుల కేటాయింపు, పంపిణీ-రిసెప్షన్-కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు వంటి అంశాలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించి, ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 28 మండలాల్లో 28 జెడ్పీటీసీ స్థానాలు, 28 ఎంపీపీలు, 377 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి 489 గ్రామ పంచాయతీలు, 4,920 వార్డుల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ పర్యవేక్షణ, నగదు-మద్యం అక్రమ రవాణా నిరోధం వంటి అంశాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్బన్, రూరల్ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 34 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి బృందంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఒక్కో అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
Arattai