నంద్యాలలో ఘనంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి
NANDYAL Oct18 :- సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 50వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ కంప్యూటర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, కవులు విశ్వనాథ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన మహోన్నత రచయిత అని పేర్కొన్నారు. నవల, కవిత్వం, నాటకం తదితర సాహిత్య ప్రక్రియల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన రచనలు తెలుగు సాహిత్య వైభవానికి ప్రతీకలని అన్నారు. సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక స్పృహ, తెలుగు భాషా సౌందర్యం ప్రతిబింబిస్తాయని అన్నారు.

యువత తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, మహాకవుల రచనలను చదవడం ద్వారా భాషపై పట్టు, సాహిత్యంపై అభిరుచి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, మాతృభాష పరిరక్షణకు సాహితీవేత్తల రచనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలంటే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని, తెలుగు సాహిత్య వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రోటరీ స్కూల్ అధినేత డి.వి.సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి కలిగించేలా సాహితీ సంస్థలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహనీయుల జీవితాలు, రచనలను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా వారిలో భాషాభిమానం, సృజనాత్మక ఆలోచనా శక్తి పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కొప్పుల ప్రసాద్, నరేంద్ర, గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Arattai