పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా పూర్తి చేయాలి: కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct05 :- జిల్లాలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, నిర్మాణాలు పూర్తయిన ప్రాజెక్టులను వినియోగానికి సిద్ధం చేసి సంబంధిత శాఖలకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల అభివృద్ధి పనులు, భూ కేటాయింపులు, ఇంజనీరింగ్ ప్రాజెక్టులు, ఆధార్ నవీకరణపై పలు కీలక సూచనలు చేశారు. ఏ శాఖకైనా భూమి అవసరమైతే సంబంధిత హెచ్ఓడీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఈ-ఫైల్ రూపంలో కలెక్టర్‌కు రిక్విజిషన్ పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల అనంతరం మాత్రమే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ల ద్వారా భూ కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సుమారు 52,133 మంది విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నందున, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను సమీప ఆధార్ కేంద్రాలు లేదా మొబైల్ కిట్లతో అనుసంధానం చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 169 ఆధార్ కేంద్రాల వివరాలను చిరునామాలతో సహా DEO, DVEOలకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేయాలని, ఇతర సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేసే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆళ్లగడ్డ లోని బాలసదనంలో నివసించే చంటి పిల్లల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎలక్ట్రికల్, సివిల్ పనులను పూర్తి భద్రతతో చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలసుదన్ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న పాత బావికి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం వంటి పనులను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఐడీసీ, సమగ్ర శిక్ష, మున్సిపాలిటీ తదితర శాఖలు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెచ్చేరువు వద్ద టాయిలెట్, నీటి వసతులు పూర్తయినందున సోలార్ ప్యానెల్స్, విద్యుత్ సదుపాయాల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ద్వారా అంచనాలు సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు
Arattai