తల్లి-బిడ్డల ఆరోగ్య భద్రతకు 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు
NANDYAL Aug12 :- ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొన్నారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తల్లి-బిడ్డల ఆరోగ్య భద్రతకు 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. గర్భిణులకు గర్భధారణ ప్రారంభ దశ నుంచే అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి, శిశువుల ఆరోగ్య భద్రతకు అవసరమైన బేబీ కిట్, ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తల్లి-బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగానే 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. ప్రజలు వైద్య సిబ్బందిపై ఎంతో విశ్వాసంతో ఆసుపత్రులకు వస్తున్నందున, ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా, మానవతా దృక్పథంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

గతంతో పోలిస్తే నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. నంద్యాల ప్రాంత అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో ఆసుపత్రి అభివృద్ధి, వైద్య మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే ఎయిడ్స్ వంటి వ్యాధులపై సమాజంలో సరైన అవగాహన ఉండడం ఎంతో అవసరమని, ‘ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర’ రథం జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాన్పు అనంతరం తల్లి, శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) సేవలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు మొత్తం 19 వాహనాలు కేటాయించగా, ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన వాహనాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులకు కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజుకు సగటున 8 నుంచి 10 ప్రసవాలు, నెలకు సుమారు 300 ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రతిరోజూ సుమారు 1,400 నుంచి 1,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు.

ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, వైద్యులు, సాంకేతిక సిబ్బంది అందుబాటును నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్య సేవలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలోని అన్ని ఆపరేషన్ థియేటర్లను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో గతంలో ఉన్న నీటి సమస్యను సంప్ వ్యవస్థ ద్వారా పరిష్కరించి, అన్ని వార్డులకు నిరంతరాయంగా నీటి సరఫరా అందేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రోగులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తోందని, గైనకాలజీ వార్డులోని రోగులకు హైప్రోటీన్ డైట్, ఇతర రోగులకు నాణ్యమైన సాధారణ ఆహారం అందిస్తున్నామని తెలిపారు. డైట్ నాణ్యత, సరఫరాపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన విభాగం, వైద్య సేవలపై స్పష్టమైన సమాచారం అందించేందుకు హెల్త్ డెస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, అర్హులైన ప్రతి రోగిని ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నమోదు చేసి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న నూతన మౌలిక వసతుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
Arattai