నంద్యాలలో ఘనంగా గాంధీ ,శాస్త్రి జయంతి వేడుకలు…
NANDYAL 02 :- నంద్యాల: నంది రైతు సమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని సమాఖ్య కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త కాదర్ బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. 1929లో మహాత్మా గాంధీ నంద్యాలకు విచ్చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని, “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదం ద్వారా దేశ రక్షణలో సైనికుల పాత్రతో పాటు రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పారని తెలిపారు. రైతులకు గౌరవం, గిట్టుబాటు ధర, సాగుకు అవసరమైన వనరులు అందేలా సమాజం కృషి చేయాలని అన్నారు.

ముఖ్యఅతిథి న్యూక్లియస్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, శాస్త్రిజీ చూపిన దేశభక్తి, నిరాడంబరత మనకు ఆదర్శం కావాలన్నారు. సమాఖ్య కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిజీల ఆశయాలు ఆలోచనలు ఇప్పటికీ ఆచరణీయమని అన్నారు మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి మాట్లాడుతూ గాంధీ ,శాస్త్రి లాంటి మహనీయుల ఆదర్శాలను నేటితరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.సమాఖ్య నిర్వాహకులు ముఖ్యఅతిథి మురళీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు జయరామిరెడ్డి , శ్రీనివాసరెడ్డి, రఫీ,మాతృభాషా పరిరక్షణ సమితి ప్రతినిధులు అవ్వారి శేషఫణి, డా.నీలం వెంకటేశ్వర్లు, రైతులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Arattai