SIR-2026 లో పేర్లు నమోదు కాని ఓటర్లకు మరో అవకాశం : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Oct07 :- ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR)-2026లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. గైర్హాజరు (Absent), వలస వెళ్లినవారు (Shifted), మరణించినవారు (Dead), డూప్లికేట్ ఓటర్లు (Duplicate) తదితర కారణాలతో ASDD కేటగిరీ కింద గుర్తించబడిన ఓటర్ల జాబితాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో తిరిగి ప్రదర్శించాలని సూచించారు.
ASDD కేటగిరీకి చెందిన అర్హులైన ఓటర్లు అవసరమైన డిక్లరేషన్‌తో పాటు ఎన్యుమరేషన్ ఫారాలను (Annexure-A) సమర్పించవచ్చని తెలిపారు. BLOలు సంబంధిత ఓటర్లను నేరుగా లేదా వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదించి ఫారాలను అందజేయాలని, రాజకీయ పార్టీల BLAలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన ఓటర్లకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు తమ EPIC నంబర్ ఆధారంగా ECI వెబ్సైట్ లేదా ECINET యాప్ ద్వారా కూడా ఫారాలను డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చని తెలిపారు.
చిరునామా మారకుండా అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లు Annexure-8 డిక్లరేషన్‌తో పాటు ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించాలని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కొత్త చిరునామా వివరాలతో Annexure-C జతచేసి సంబంధిత ERO/AEROకు అందజేయాలని సూచించారు. నిరాశ్రయ ఓటర్లకు BLO సమర్పించే క్షేత్రస్థాయి ధృవీకరణ నివేదికను నివాస ధృవీకరణగా పరిగణించే వెసులుబాటు ఉందని తెలిపారు.
అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు తుది జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నిరాశ్రయులు, బలహీన వర్గాలు, సంప్రదించడానికి వీలుకాని ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డూప్లికేట్ నమోదులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2026 నవంబర్ 30న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వ్యక్తులు నిరంతర నవీకరణ (Continuous Updation) ప్రక్రియ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తదుపరి అర్హత తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత కూడా ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
భారత ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాలను జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సద్వినియోగం చేసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు.
Arattai