స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Oct 08:- స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేసి, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ రాము నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని ఆరు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 212 ఎన్నికల వార్డులు, 511 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి భవనాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్, వెలుతురు, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస సౌకర్యాలను నిర్ధారించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల అనుభవాలు, స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకుని పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను త్వరగా ఖరారు చేయాలన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన ప్రింటర్లను గుర్తించి, పోలింగ్ సిబ్బంది వివరాలను సేకరించి సమగ్ర డేటాబేస్ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ, ఓట్ల లెక్కింపునకు అనువైన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ముందుగానే గుర్తించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల నంబరింగ్, సీలింగ్, స్వస్తిక్ ముద్ర వినియోగం తదితర అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అవసరమైన ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల లభ్యత, సిబ్బంది సమీకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.

అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు సన్నాహాలను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటు హక్కు వినియోగం, ఎన్నికల విధానాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువ ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని చేరవేయడంతో పాటు జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా అందించే సేవలపై ప్రచారం చేపట్టాలని, అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలని ఆదేశించారు.
Arattai