పల్లె పండుగ కింద గ్రామాల్లో అభివృద్ధి పనులు : జిల్లా కలెక్టర్ రాజకుమారి
NANDYAL Oct07 :- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల నుంచి అందిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బుధవారం ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో ముస్లిం, ఎస్సీ స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో చిన్న ఏరుపై రూ.60 లక్షలతో నిర్మించిన కల్వర్టును, కోటకందుకూరు గ్రామంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జంబులదిన్నె గ్రామంలోని ముస్లిం, ఎస్సీ స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో చిన్న ఏరు దాటేందుకు సౌకర్యం లేక మృతదేహాలను నీటిలో నుంచి తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితికి సంబంధించిన ఫొటోను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి రూ.60 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, ప్రస్తుతం ఆ నిర్మాణం పూర్తయిందని వివరించారు. ఇదే తరహా సమస్యలు ఉన్న మరో 14 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించామని, పనులను వేగవంతంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

జంబులదిన్నె గ్రామంలో పల్లె పండుగ 1.0, 2.0 కింద ఇప్పటికే రూ.70 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా, పల్లె పండుగ 3.0 కింద మరో రూ.20 లక్షల పనులకు నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అందిన తాగునీరు, రహదారులు, పాఠశాలల ప్రహరీ గోడలు తదితర సామూహిక అవసరాలకు సంబంధించిన వినతులను కూడా ప్రాధాన్యతతో పరిశీలించి, అవసరమైన నిధులు సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్థులు తమ ప్రాంతానికి అవసరమైన ఇతర అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటికి అంచనాలు రూపొందించి నిబంధనల మేరకు దశలవారీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

కోటకందుకూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె పండుగ 1.0, 2.0 కింద కోటకందుకూరు గ్రామానికి ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరు చేయగా, పల్లె పండుగ 3.0 కింద సీసీ రోడ్డు నిర్మాణానికి తాజాగా రూ.40 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సూచించిన మేరకు గ్రామంలో అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అంచనాలు సిద్ధం చేయాలని, తదనుగుణంగా నిధుల మంజూరుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మించిన మౌలిక వసతులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు, వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, జంబులదిన్నె గ్రామంలో పల్లె పండుగ 1, 2, 3 విడతల కింద దాదాపు రూ.95 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని నీటిలో నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితికి సంబంధించిన ఫొటోను చూసిన వెంటనే స్పందించి కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జంబులదిన్నె గ్రామంతో పాటు ఎస్సీ కాలనీ సహా ఇలాంటి సమస్యలు ఉన్న మొత్తం 14 ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కందుకూరు రహదారి అధ్వానంగా ఉన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. PGRS కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతి సమస్యను ఓపికగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం ఫాలోఅప్ చేసి, అవసరమైన నిధులు కేటాయించి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Arattai