13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో మరోసారి సేవ చేసే అవకాశం కల్పించండి : ఖండే శ్యాంసుందర్ లాల్
NANDYAL Oct30 :- నంద్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఖండే శ్యాంసుందర్ లాల్ మీడియా సమావేశం నిర్వహించి వార్డు ప్రజలకు, జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన జర్నలిస్టు సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈసారి కూడా కుటుంబ సభ్యుడిగా భావించి తనవిజయానికి సహకరించాలని కోరారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో దాదాపు 75 శాతం నెరవేర్చిన తర్వాతే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. వార్డులోని ప్రజలు తన సేవలను గుర్తించి సానుకూలంగా స్పందిస్తున్నారని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు అభినందిస్తున్నారని పేర్కొన్నారు.తాను గత 45 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో వ్యాపారం చేస్తున్నానని, స్థానిక ప్రజలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు వచ్చానని తెలిపారు. గత ఐదేళ్లలో కులమతాలకు అతీతంగా పేదలకు వైద్య సహాయం, అవసరమైన మందుల పంపిణీ, విద్యార్థులకు చదువులో ఆర్థిక సహాయం అందించానని వివరించారు. కోవిడ్ సమయంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.
ప్రతి ఓటు ఎంతో విలువైనది
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న 13వ వార్డు ఓటర్లు సైతం స్వస్థలానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బాలాజీ కాంప్లెక్స్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.గతంలో బాలాజీ జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్ కేంద్రం ప్రస్తుతం కేశవరెడ్డి స్కూల్లో, అంటే పాత విజయవాణి స్కూల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజలకు తమ నాయకులను ప్రశ్నించే హక్కు, అధికారం ఉంటుందని ఖండే శ్యాంసుందర్ లాల్ పేర్కొన్నారు.
స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరగాలి
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అంతిమ నిర్ణయం ఓటర్లదేనని అభ్యర్థి పేర్కొన్నారు. ప్రత్యర్థులు ఎవరైనా సరే పరస్పర గౌరవంతో, సంయమనంతో వ్యవహరించాలని, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు ఎవరూ పాల్పడకూడదని సూచించారు. బాలాజీ కాంప్లెక్స్‌లో వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్నందున స్నేహపూర్వక ఎన్నికలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి అభ్యర్థులను గెలిపించండి
నంద్యాల పట్టణంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారని తెలిపారు. మొత్తం 52 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఆయన సుదీర్ఘకాలంగా వైద్యుడిగా ప్రజలకు సేవలందించారని, వివాదరహితమైన వ్యక్తిత్వం, నిరాడంబరమైన జీవనశైలి కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.ఖండే శ్యాంసుందర్ లాల్ఈ సందర్భంగా 13వ వార్డు ప్రజలు తనకు మరోసారి అవకాశం కల్పించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తనకు వెన్నెముకలా నిలిచిన వార్డు ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈసారి కూడా వారి ఆశీర్వాదం లభిస్తుందనే నమ్మకం ఉందని అభ్యర్థి ఖండే శ్యాంసుందర్ లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Arattai