హెచ్ఐవీ నియంత్రణలో మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చాలి :జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct28 :- జిల్లాలో హెచ్ఐవీ నియంత్రణకు నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం అమలు, హెచ్ఐవీ నియంత్రణ లక్ష్యాల సాధనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా మొదటి లక్ష్యమైన హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో తమ హెచ్ఐవీ స్థితిని తెలుసుకునే వారి శాతాన్ని పెంపొందించడం, రెండో లక్ష్యమైన హెచ్ఐవీ బాధితులను ఏఆర్టీ చికిత్సకు అనుసంధానించి క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చూడటం అనే రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించి, పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
మొదటి లక్ష్యం: 95 శాతం మందికి హెచ్ఐవీ స్థితిపై అవగాహన కల్పించాలి
హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో కనీసం 95 శాతం మంది తమ హెచ్ఐవీ స్థితిని తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ ఐసీటీసీ (ICTC) వాహనాలను సమర్థవంతంగా వినియోగిస్తూ, హెచ్ఐవీ ముప్పు అధికంగా ఉన్న వర్గాలను గుర్తించి పరీక్షల పరిధిని విస్తరించాలని సూచించారు. తద్వారా హెచ్ఐవీని ముందస్తుగా గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
రెండో లక్ష్యం: హెచ్ఐవీ బాధితుల్లో 95 శాతం మందిని ఏఆర్టీ చికిత్సకు అనుసంధానించాలి
హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో కనీసం 95 శాతం మందిని ఏఆర్టీ (ART) కేంద్రాలకు అనుసంధానించి, వైద్యుల సూచనల మేరకు జీవితకాలం క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని త్వరితగతిన చికిత్స పరిధిలోకి తీసుకురావాలని, చికిత్సకు దూరమైన లాస్ట్ టు ఫాలోఅప్ (LFU) కేసులను గుర్తించి తిరిగి చికిత్స పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి నెలా ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తూ చికిత్స కొనసాగింపును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
హెచ్ఐవీ బాధితుల జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర ప్రాథమిక సంబంధిత వ్యక్తులకు అవసరమైన పరీక్షలు, కౌన్సెలింగ్ అందించాలని తెలిపారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన అంశాలను గుర్తించి, గత ఏడాది గణాంకాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రస్థాయి గణాంకాలను విశ్లేషించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఎంహెచ్‌వో డా. శారదాబాయి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్ తదితరులు పాల్గొన్నారు.
Arattai