స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించాలి : ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్యామల
NANDYAL Oct28 :- జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. శ్యామల సూచించారు. ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ప్రతి నిబంధనను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. బుధవారం నంద్యాల, బేతంచెర్ల, డోన్ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి చేపట్టిన చర్యలను ఆమె పరిశీలించారు. ఎన్నికల వ్యయ నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, అభ్యర్థుల ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసి, నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం లేదా ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. శ్యామల పేర్కొన్నారు.
Arattai