పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Oct16:- నంద్యాల జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అభ్యర్థులకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీతో కూడిన ఆరు పట్టణ స్థానిక సంస్థల్లో ఈరోజు (అక్టోబరు 16) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

నామినేషన్ల దాఖలుపై అభ్యర్థులకు పూర్తి సహకారం
నామినేషన్ పత్రాల భర్తీ, వాటికి జతచేయాల్సిన ధ్రువపత్రాలు, డిపాజిట్ మొత్తం చెల్లింపు తదితర అంశాలపై అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను నిబంధనల ప్రకారం పూర్తిచేసి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత సమయంలో సమర్పించేలా హెల్ప్ డెస్క్‌ల ద్వారా సహకారం అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ధ్రువపత్రాల జారీలో జాప్యం వద్దు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో సేవలు అందించాలన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల నోటిఫికేషన్ జారీతో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా, నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Arattai