అసంతృప్తి వ్యక్తమైన అర్జీలపై ప్రత్యేక పునఃపరిశీలన : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct 04 :- ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ, అధికారులు అందించిన పరిష్కారాలపై అర్జీదారుల వాస్తవ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన QR కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా సమర్పించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యల పట్ల అర్జీదారులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో నేరుగా తెలుసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ తెలిపారు.ఫీడ్బ్యాక్ నమోదు ఇలా చేయాలి: అర్జీ పరిష్కారమైనట్లు సమాచారం అందిన అనంతరం, సంబంధిత రసీదు లేదా సందేశంలో ఉన్న QR కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి, పరిష్కారంపై తమ సంతృప్తి లేదా అసంతృప్తిని అర్జీదారులు నమోదు చేయాలి. ప్రజల నుంచి అందే అభిప్రాయాల ఆధారంగా పరిష్కారాల నాణ్యతను అంచనా వేసేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
అసంతృప్తి వ్యక్తమైన అర్జీలపై ప్రత్యేక దృష్టి:
అధికారులు అందించిన పరిష్కారంపై అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన పక్షంలో, సంబంధిత అర్జీలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్షిస్తారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో సమస్యను పునఃపరిశీలించి, అర్జీదారులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు.అధికారుల జవాబుదారీతనానికి ప్రాధాన్యం: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వంటి అంశాలను గుర్తించడంతో పాటు, ప్రభుత్వ సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరిచేందుకు ప్రజల ఫీడ్బ్యాక్ కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అర్జీదారులందరూ తమ సమస్య పరిష్కారమైన అనంతరం QR కోడ్ ద్వారా తప్పనిసరిగా వాస్తవ అభిప్రాయాన్ని నమోదు చేసి, ప్రజలకు జవాబుదారీగా ఉండే పారదర్శక పాలనను బలోపేతం చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కోరారు.
Arattai