కుందూ సాహితీ సమితి ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ….
NANDYAL Oct 04 :- కుందూ సాహితీ సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నంద్యాల ప్రాంత పర్యటనతో పాటు స్వాతంత్ర్యోద్యమ చరిత్రను ప్రతిబింబించే “నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం – స్వరాజ్య సమరంలో నంద్యాల” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. డా. కురుమేటి కిశోర్ కుమార్ రచించిన ఈ గ్రంథాన్ని డా. కాదర్ బాద్ రవీంద్రనాథ్ ఆవిష్కరించారు. అతిథులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుస్తక సమీక్షకులు డా.దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ, “నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం” గ్రంథం గాంధీజీ నంద్యాల పర్యటనతో పాటు నంద్యాల ప్రాంత సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలను కూడా మన ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఆవిష్కర్త డా. కాదర్ బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మరుగునపడిన మహనీయులను వెలుగులోకి తీసుకురావడం, మరచిపోయిన చారిత్రక అంశాలను భద్రపరచి భావితరాలకు అందించడంలో డా. కురుమేటి కిశోర్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సభాధ్యక్షులు డా. గెలివి సహదేవుడు మాట్లాడుతూ, చాగలమర్రి నుంచి ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు మీదుగా ఆదోని వరకు సాగిన మహాత్మా గాంధీ పర్యటన, సభలు, సమావేశాలు, నిధుల సేకరణ తదితర అంశాలను రచయిత ఆధారాలతో సహా గ్రంథంలో పొందుపరిచారని తెలిపారు.

డా. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ నంద్యాలలో కాదర్ బాద్ నరసింగరావు గాంధీజీకి ఆతిథ్యం ఇవ్వడం, ఆయన నెయ్యితో చేసిన వంటకాలను ఇష్టంగా తినడం వంటి ఆసక్తికరమైన విషయాలు పుస్తకంలో ఉన్నాయన్నారు. డా. హరికిషన్ మాట్లాడుతూ నంద్యాలతో ముడిపడిన స్వాతంత్ర్యోద్యమ చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేయడం ఈ పుస్తక ప్రత్యేకత అని అన్నారు. శ్రీనిధి రఘువీర్ మాట్లాడుతూ వైద్యవృత్తిలో కొనసాగుతూనే చరిత్ర పరిశోధనపై ఆసక్తితో నంద్యాల ప్రాంతానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను రచయిత సేకరించడం ప్రశంసనీయమన్నారు. రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డా. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ “నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం” గ్రంథం రచయిత పరిశోధనా తపనకు నిదర్శనమన్నారు. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు చంద్రశేఖర కల్కూర, జె.యస్.ఆర్.కె. శర్మ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను నంద్యాల ప్రాంతంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన “నంద్యాల గాంధీ” కాదర్బాద్ నరసింగరావు*తో పాటు *గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నివర్తి వెంకట సుబ్బయ్య తదితర దాదాపు 66 మంది స్వాతంత్ర్య సమరయోధుల వివరాలను రచయిత సేకరించారని తెలిపారు. వారి ఫొటోలు, జీవిత విశేషాలను సేకరించి నేటి తరానికి అందించడం విలువైన చారిత్రక సేవ అని కొనియాడారు.

రచయిత డా. కురుమేటి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే నంద్యాల చరిత్రపై తనకు ఉన్న ఆసక్తి ఈ గ్రంథ రూపకల్పనకు కారణమైందని తెలిపారు. పెద్దలు, సాహితీవేత్తల ఆశీస్సులతో పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం రచయిత డా. కురుమేటి కిశోర్ కుమార్*ను సాహితీప్రియులు ఘనంగా సత్కరించారు. అలాగే సాహితీరంగంలో విశేష కృషి చేసిన పలువురు సాహితీవేత్తలను, అతిథులను *డా. కిశోర్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. పాండురంగారావు, డా. గురుప్రసాద్, డా. వి.వి. రమణమూర్తి, మన్సూర్ రెహమాన్, వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు అన్నెం శ్రీనివాసరెడ్డి, అవ్వారి శేషఫణి, శ్రీనివాసమూర్తి, డా. నీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Arattai