విపత్తు నిర్వహణ,ముందస్తు చర్యలపై సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్
NANDYAL Sep26:- వర్షాకాలం, రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని జాయింట్ సూరజ్ ధనంజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు అడిషనల్ ఎస్పీ సుస్మిత స్వామినాథన్, డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీవోలు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ విపత్తు నిర్వహణ, ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ….వర్షాకాలం, రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలు, అవసరమైన నిధులు, ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలపై సమీక్షిస్తూ….కెనాల్ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కరకట్టల పటిష్టత, సైడ్ లైనింగ్ పనులపై సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. ప్రాజెక్టుల మెకానికల్ గేట్ల పనితీరును క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాజ్‌వేలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు సిద్ధం చేయాలన్నారు. బలహీనంగా ఉన్న వంతెనలు, కాజ్‌వేల స్థానంలో అవసరమైన నూతన వంతెనలు, కాజ్‌వేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

వేసవి లేదా విపత్తు పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు వర్షాభావం, అనావృష్టికి గురయ్యే మండలాలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల రక్షణకు సంబంధించి రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు. విపత్తు అనంతరం పంట నష్టం, నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ తదితర అంశాలపై అంచనాలను వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయి బృందాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే, సమస్యాత్మక గ్రామాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, మెడికల్ క్యాంప్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు క్లోరినేషన్ మాత్రలు, అవసరమైన మందులు, వైద్య సామగ్రిని తగినంతగా అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల పూర్తి వివరాలు, చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులు, ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలపై శాఖల వారీగా సమగ్ర నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విపత్తు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టం తీవ్రతను తగ్గించవచ్చని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
Arattai