శ్రీ భద్రావతి భావనఋషి దేవాలయంలో వైభవంగా రుక్మిణి కల్యాణం
NANDYAL Sep26 :- నంద్యాల పట్టణంలోని శ్రీ భద్రావతి భావనఋషి దేవాలయంలో లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు రోజుల శ్రీమద్భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీకృష్ణ–రుక్మిణి కల్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల వ్యాఖ్యాత దీవి హయగ్రీవాచార్యులు ఆధ్వర్యంలో రుక్మిణి కల్యాణ ఘట్టాన్ని భక్తులకు ఆధ్యాత్మిక రసానుభూతి కలిగించేలా ప్రవచించారు.

భాగవత పురాణంలోని రుక్మిణి కల్యాణ ఘట్టాన్ని వివరిస్తూ, విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి శ్రీకృష్ణుడి దివ్య గుణాలు, పరాక్రమం, కరుణ గురించి విని ఆయననే తన భర్తగా మనసారా కోరుకుందని వివరించారు. అయితే రుక్మిణి అన్న రుక్మి ఆమెను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించడంతో, రుక్మిణి తన పరిస్థితిని తెలియజేస్తూ శ్రీకృష్ణుడికి సందేశం పంపిందని తెలిపారు.రుక్మిణి భక్తికి, ఆమె నిర్మలమైన ప్రేమకు స్పందించిన శ్రీకృష్ణుడు విదర్భకు చేరుకుని, రుక్మిణిని తనతో తీసుకెళ్లి వివాహం చేసుకున్న ఘట్టమే రుక్మిణి కల్యాణం అని వివరించారు. ఈ ఘట్టం ద్వారా భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసంతో, నిష్కల్మషమైన భక్తితో శరణాగతి చేసిన భక్తులను శ్రీకృష్ణుడు తప్పక ఆదుకుంటాడనే ఆధ్యాత్మిక సందేశం అందుతుందని హయగ్రీవాచార్యులు పేర్కొన్నారు.
Arattai