ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct22 :- ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల జిల్లా గోస్పాడు మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నిర్వహిస్తున్న విధులు, నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలను సమీక్షించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో కవరేజ్ ద్వారా నమోదు చేయడంతోపాటు, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి దశలోనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు, స్వీకరణకు సంబంధించి అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై నిరంతరం నిఘా ఉంచాలని, ఉల్లంఘనలు గుర్తించినప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన రోజువారీ వివరాలు, నివేదికలను నిర్దేశిత నమూనాలో ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి, పోలీసు శాఖ, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నామినేషన్ల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
Arattai