గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదు
NANDYAL Oct 02 :- గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ఎన్నికల్లో ఎలాంటి చిన్నపాటి లోపాలకు కూడా తావులేకుండా ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు (ROలు), జోనల్ అధికారులు ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధతపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు
పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సౌకర్యవంతమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్‌తో కూడిన పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని, పోలింగ్ కోసం ఎంపిక చేసే గదులు శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సమయానికి నాణ్యమైన అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సిబ్బందికి రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతి కల్పించడంతో పాటు, విధుల ధ్రువీకరణ పత్రాలు, గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
ఓటింగ్ ప్రక్రియలో అప్రమత్తత
ఓటర్లు ఓటరు స్లిప్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఫొటో గుర్తింపు కార్డును తీసుకువచ్చేలా ముందస్తు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఓటింగ్‌కు ఉపయోగించే స్వస్తిక్ మార్క్ స్టాంపుల నాణ్యతను ముందుగానే తనిఖీ చేయాలని, స్టాంప్ ప్యాడ్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం కారణంగా పోలింగ్‌కు అంతరాయం కలగకుండా ప్రిసైడింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా రిసెప్షన్ కేంద్రాలకు తరలించేలా రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలతో జెడ్పీ సీఈఓ సమన్వయం చేసుకోవాలని, బస్సులు, ఇతర వాహనాల రూట్లు, పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే నిర్ధారించాలన్నారు. బ్యాలెట్ బాక్సులతో కూడిన వాహనాలు రహదారులపై ఎక్కువసేపు నిలిచిపోకుండా పోలీసు, జోనల్ అధికారుల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని స్పష్టం చేశారు.
వెబ్‌కాస్టింగ్, సీసీటీవీతో నిరంతర పర్యవేక్షణ
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ లేదా వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా సుమారు 400 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, మిగిలిన 800కు పైగా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పోలింగ్ సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Arattai