దీపావళి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
NANDYAL Oct 02 :- 2026 దీపావళి పండుగను జిల్లాలో ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వర్చువల్ సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాలకు నిబంధనల ప్రకారం మాత్రమే లైసెన్సులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మకాలు ప్రారంభించే ముందే అన్ని విక్రయ కేంద్రాలను సంయుక్తంగా తనిఖీ చేసి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. అనధికారిక విక్రయాలు, నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ స్పష్టం చేశారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, సున్నితమైన ప్రదేశాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర గస్తీ నిర్వహించాలి. అక్రమ బాణసంచా విక్రయాలు, నిల్వలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను సూచించారు.
అగ్నిమాపక శాఖ ముందస్తుగా విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లను ధృవీకరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాలు, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జేసీ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు మార్కెట్ ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. బాణసంచా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది, మందులు, కాలిన గాయాల చికిత్సకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో బాణసంచా వినియోగంపై భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని, ప్రమాదకరమైన పద్ధతులకు దూరంగా ఉండాలని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
రెవెన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నా, ఏర్పాట్లలో లోపాలు గుర్తించినా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని జేసీ సూచించారు.
Arattai