చిన్నారి విద్యాభ్యాసానికి కలెక్టర్ అండ
NANDYAL Oct28 :– కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన చిన్నారి గురులక్ష్మి ప్రసన్న విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగేందుకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అండగా నిలిచారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రసన్నకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కళాశాల ఫీజుకు సంబంధించిన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసానికి అడ్డంకి కాకూడదని, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రసన్నను సూచించారు. ఆమె విద్యాభ్యాసానికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో వర్షాల కారణంగా మట్టిమిద్దె కూలిన ఘటనలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన ప్రసన్నకు ప్రభుత్వం గతంలో రూ.10 లక్షల ఆర్థిక పరిహారం అందించింది.అప్పట్లో విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాస బాధ్యతను స్వీకరించిన కలెక్టర్, ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫీజును చెల్లించారు. తాజాగా ద్వితీయ సంవత్సరం ఫీజును కూడా అందజేశారు. ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన ప్రసన్నను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యాభ్యాసానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్కు ప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు.
Arattai