ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం : జాయింట్ కలెక్టర్ జి. సూరజ్ ధనుంజయ్
NANDYAL Oct27:- మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు) కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ జి. సూరజ్ ధనుంజయ్ సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, పోలింగ్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేలా నిశితంగా పరిశీలించడంలో సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు) కీలక పాత్ర పోషించాలని సూచించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విధులపై సూక్ష్మ పరిశీలకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పరిస్థితులు, ఓటర్లకు కల్పించిన సదుపాయాలు, బలహీన వర్గాల ఓటర్లపై ఒత్తిళ్లు లేదా ఆధిపత్య ధోరణులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వంటి అంశాలను తటస్థంగా పరిశీలించాలన్నారు.

నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
పోలింగ్ కేంద్రాల వెలుపల ఓటర్లకు తగిన స్థలం, ఓటరు గుర్తింపు కార్డులు, ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉన్నాయా లేదా గమనించాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు బ్యాలెట్ బాక్సును ఖాళీగా చూపించడం, సీలింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించడం, పోలింగ్ ఏజెంట్ల హాజరు, ఎన్నికల సామగ్రి వినియోగం వంటి అంశాలను పరిశీలించాలని తెలిపారు.

అనెక్సర్-3 మార్గదర్శకాల ప్రకారం నివేదికలు
ఎన్నికల సంఘం నిర్దేశించిన అనెక్సర్-3లోని మార్గదర్శకాలను అనుసరించి పరిశీలన చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అందించిన ప్రశ్నావళిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘అవును’ లేదా ‘కాదు’ రూపంలో సమాధానాలు నమోదు చేయాలని, నివేదికలను నిర్దేశిత నమూనాలో సమర్పించాలని స్పష్టం చేశారు. సూక్ష్మ పరిశీలకులు ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా, ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. డిఆర్ఓ రామునాయక్, ఎల్డియం అయ్యపురెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Arattai