నంద్యాల శ్రీరామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
16 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఎంబీఏ 2007–2009 బ్యాచ్ విద్యార్థులు.. మధుర జ్ఞాపకాల నెమరువేత
NANDYAL :- నంద్యాల శ్రీరామకృష్ణ పీజీ కళాశాలలో ఎంబీఏ 2007–2009 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకుని, తమ విద్యాభ్యాస సమయంలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. పాత స్నేహాలను గుర్తు చేసుకుంటూ, తమ జీవితాల్లో సాధించిన విజయాలను పరస్పరం పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి విజయకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దాదాపు 16 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరినీ ఒకచోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి, నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను చేరుకున్న పూర్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ సేవకు కూడా ప్రాధాన్యతనిస్తూ, సమాజ పురోగతికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.

అలాగే, పూర్వ విద్యార్థులు తమ పిల్లలకు నాణ్యమైన, ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం పూర్వ విద్యార్థులు కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య సమ్మేళనం సందడిగా సాగింది. ఈ సమావేశం పాత స్నేహాలను మరోసారి చిగురింపజేస్తూ, విద్యార్థి జీవితంలోని మధురానుభూతులను గుర్తు చేసిన ఆత్మీయ వేడుకగా నిలిచింది.
Arattai