స్థానిక ఉత్పత్తులకు మార్కెట్.. మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యం : కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Oct05 :- మహిళలు, గిరిజన మహిళలు, స్థానిక ఉత్పత్తిదారులు తయారు చేస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేయడమే ‘వనస్య ది ఎక్స్పీరియన్స్ సెంటర్’ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వనస్య ది ఎక్స్పీరియన్స్ సెంటర్’ను కలెక్టర్ సందర్శించి, అక్కడ ప్రదర్శనకు, విక్రయాలకు ఉంచిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల తయారీ, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్ విధానం తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మహిళలు చేపడుతున్న జీవనోపాధి కార్యక్రమాలకు అవసరమైన మార్కెటింగ్ సహకారం అందించడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించవచ్చని తెలిపారు. స్థానికంగా తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ వేదిక అందుబాటులోకి రావడం వల్ల మహిళా సంఘాలు, గిరిజన మహిళలు, చిన్నతరహా ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు చేరువ చేయగలుగుతారని పేర్కొన్నారు. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మహిళా ఉత్పత్తిదారులకు అవసరమైన సహకారం అందించి, ‘వనస్య’ను సమర్థవంతమైన మార్కెటింగ్ వేదికగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోజువారీ విక్రయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

జిల్లాలోని మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించేలా సోవెనీర్ లేదా గిఫ్ట్ ప్యాక్‌లను స్థానిక మహిళా ఉత్పత్తులతోనే రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ఉత్పత్తుల ఎంపిక, ప్యాకేజింగ్, ధరలను నిర్ణయించి, స్థిరమైన రేట్లతో ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ నమూనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వనస్య సెంటర్లో మహిళలు తయారు చేస్తున్న జ్యువెలరీ, జూట్ బ్యాగులు, పౌచ్‌లు, అలంకరణ వస్తువులు, ఇతర హస్తకళా ఉత్పత్తులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, వివిధ ఈవెంట్లలో వేదిక అలంకరణకు ఉపయోగించే బొమ్మలు (Dolls), ఇతర అలంకరణ ఉత్పత్తులు కూడా మహిళా సంఘాల ద్వారా తయారు చేస్తున్నందున వాటిని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే అవసరానికి అనుగుణంగా జూట్ బ్యాగులు, పౌచ్‌లు తదితర ఉత్పత్తులను రెండు, మూడు రోజుల్లోనే ప్రత్యేక డిజైన్‌తో తయారు చేసి అందించే అవకాశం ఉందని తెలిపారు.

మహిళా ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, విద్యాసంస్థల ద్వారా బల్క్ ఆర్డర్లు వచ్చేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెడికల్, పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో వనస్య ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో బొకేలు, షాల్స్కు బదులుగా స్థానిక మహిళా ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళల జీవనోపాధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనీషా, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకటదాసు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Arattai