APSRTCలో 17 వేల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి : NMU డిమాండ్
NANDYAL :- ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 17 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు 4 వేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా డిపో నాయకులు సుబ్బరాజు, యోగారెడ్డి ఆధ్వర్యంలో ఏపీపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నంద్యాల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు రాజేష్, వినోద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అయితే అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులపై పని భారం పెరుగుతోందని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సిబ్బంది కొరతను అధిగమించాలని కోరారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షిస్తూ ఆర్టీసీని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Arattai