విజయవంతమైన ఐ.ఎమ్.ఏ మహిళా విభాగం రొమ్ము క్యాన్సర్ అవగాహన భారీ ర్యాలీ
NANDYAL Oct03 :- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నంద్యాలలో అక్టోబర్ నెల ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం పురస్కరించుకుని వైద్యులు,కళాశాల విద్యార్థినులతో పట్టణంలో *పింక్ వాకథన్” పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు.ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి,కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ,గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నర్మద,నంద్యాల స్త్రీ వ్యాధులు, ప్రసూతి వైద్యుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణిల నిర్వహణలో ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

టౌన్ హాల్ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జండా ఊపి ర్యాలీ ప్రారంభించి, ర్యాలీ చివరి వరకు వైద్యులతో,విద్యార్థినులతో కలిసి నడిచారు.ప్రారంభంలో మహిళా వైద్యులు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులకు లఘు నాటికల ద్వారా, ప్రసంగాల ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రాథమిక దశలో గుర్తించడానికి స్వీయ పరీక్ష విధానాలు వివరించారు.

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ర్యాలీ ప్రారంభంలో ప్రసంగిస్తూ దేశంలో ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి స్వీయ పరీక్షలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమన్నారు. తద్వారా ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిస్థాయిలో క్యాన్సర్ నుండి విముక్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నారు. ఐఎంఏ నంద్యాల మహిళా వైద్యులు అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

కలెక్టర్ రాజకుమారి ప్రసంగిస్తూ మహిళలలో వచ్చే రొమ్ము క్యాన్సర్,గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పై అవగాహన ప్రతి ఒక్కరిలో పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశలో ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ,ఐఎంఏ సభ్యుల తో కలిసి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి ప్రోత్సహిస్తామన్నారు. నంద్యాల వైద్యుల సేవా దృక్పథం అభినందనీయమన్నారు.

ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం నాయకులు డాక్టర్ మాధవి, డాక్టర్ నాగమణి,డాక్టర్ నర్మద, డాక్టర్ సునీత, డాక్టర్ వసుధ,డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించామని,పాఠశాలలలో, కళాశాలలో బాలికలకు, యువతులకు ఆరోగ్య రక్షణ అవగాహన కల్పించడం, మంచి,చెడు స్పర్శల గురించి తెలియజేయడం, పోషకాహార విలువల గురించి తెలపడం, సోషల్ మీడియా ప్రభావం, ఆత్మహత్యల నివారణలపై తరచు అవగాహన కార్యక్రమాలు “క్లినిక్ ల వెలుపల ఆరోగ్య రక్షణ”(కేర్ బియాండ్ క్లినిక్) పేరు మీద సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

ఐఎంఏ మహిళా వైద్యులు రొమ్ము క్యాన్సర్ నివారణలో స్వీయ పరీక్ష విధానాలపై రూపొందించిన కరపత్రాలను ఎంపీ, కలెక్టర్ ఆవిష్కరించారు.ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ఐఎంఏ పింక్ క్యాప్ లు అందివ్వడంతో, ర్యాలీ పింక్ ప్రవాహం లాగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం నాయకులు డాక్టర్ మాధవి, డాక్టర్ నాగమణి,డాక్టర్ నర్మద, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ డాక్టర్ వసుధ,డాక్టర్ సౌజన్య,జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద బాయ్,జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్, డాక్టర్ రాజ్ కుమార్, మహిళా వైద్యులు డాక్టర్ కల్పన,డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ నాగ రేఖ, డాక్టర్ రాధిక,డాక్టర్ తనూజ, డాక్టర్ గీతావాణి, డాక్టర్ సుస్మిత, డాక్టర్ శిల్పా, డాక్టర్ శశి కిరణ్, డాక్టర్ రజని, డాక్టర్ అనిత, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ అరీఫా భాను, డాక్టర్ అనిత, డాక్టర్ దివ్య తేజ, డాక్టర్ మానస, డాక్టర్ భారతి,డాక్టర్ అనుప్రియ,డాక్టర్ సునీత,తదితరులు పాల్గొన్నారు.
Arattai