నంద్యాలలో 36వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు
NANDYAL Sep29 :- ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలాజిస్ట్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, నంద్యాల అనస్థీషియా వైద్యుల సంఘం నిర్వహణలో, శాంతిరాం వైద్య కళాశాలలో వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 24,25,26, తేదీలలో నిర్వహించనున్న 36 వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు ప్రథమ సమాచార బ్రోచర్ మంగళవారం శాంతిరాం వైద్య కళాశాలలో శాంతిరాం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతి రాముడు ఆవిష్కరించారు.
సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రథమ సమాచార బ్రోచర్ విడుదల చేసిన తదుపరి డాక్టర్ మిద్దె శాంతి రాముడు మాట్లాడుతూ నంద్యాల లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.అనస్థీషియా విభాగం వైద్య ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నదని ప్రశంసించారు. శాంతిరాం వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించడానికి అవసరమైన వసతులు అన్నీ ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలాజిస్ట్స్ నంద్యాల శాఖ ఘనంగా నిర్వహించి నంద్యాల వైద్య రంగానికి పేరు తీసుకురావాలని కోరారు. సదస్సు విజయవంతం కావడానికి కళాశాల తరఫున అన్ని రకాల సహకారం అందజేస్తామని తెలిపారు.

సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రఖ్యాత రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ అనస్థీషియా వైద్య నిపుణులు వైద్య వైజ్ఞానిక సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని, భారతీయ అనస్థీషియా వైద్యుల సంఘం జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్రం నలుమూలల నుండి 700 మంది అనస్థీషియా వైద్యులు ప్రతినిధులుగా పాల్గొంటారని తెలిపారు. సదస్సులో అనస్థీషియా రంగంలో వచ్చిన అత్యాధునిక విధానాలు, నూతన పరికరాల వినియోగం పై అనస్థీషియా వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సులో భాగంగా అవగాహన పెంచడం జరుగుతుంది అన్నారు. తద్వారా ప్రజలకు ఆయా ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఈ ప్రతిష్టాత్మక సదస్సు శాంతిరాం వైద్య కళాశాలలో నిర్వహించడానికి అవకాశం కల్పించిన చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతి రాముడు కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాంతిరాం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వసంత చౌహాన్, శాంతిరాం వైద్య కళాశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ నాగరాజా రెడ్డి,ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలాజిస్ట్స్ నంద్యాల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ నాగరాజు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ చెన్నకేశవ,డాక్టర్ రవితేజ, డాక్టర్ ఫణీంద్ర రెడ్డి పాల్గొన్నారు.
Arattai